ఒంటరిగా పోటీ చేస్తే, 2019 ఎన్నికల్లో ఓటమి తప్పదుః జగన్‌కు తేల్చిచెప్పిన ప్రశాంత్‌ కిషోర్‌

2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ఆయన 2019 ఎన్నికల వరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ని అధికారంలోకి తెచ్చేందుకు అవసరమైన వ్యూహాలను ప్రశాంత్ కిషోర్ టీం రచించనుంది. తాజాగా, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రాథమిక వ్యూహం గురించి ప్రశాంత్‌ కిషోర్ జగన్ కు తాజాగా ఓ బేసిక్‌ రిపోర్ట్ సబ్‌మిట్ చేసినట్లు తెలుస్తోంది.

 

విశ్వసనీయ వర్గాల సమాచార ప్రకారం, రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే, తెలుగుదేశం పార్టీకి లాభం కలుగుతుందని, దాన్ని అడ్డుకునేందుకు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన.. తదితర భావ సారూప్య పార్టీలను కలుపుకుని మహా కూటమిని ఏర్పాటు చేస్తే వైసీపీ అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని ప్రశాంత్ కిశోర్ తన నివేదికలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన సూచనల మేరకు పవన్ కల్యాణ్ తో పొత్తు కుదుర్చుకోవడానికి వైఎస్ జగన్‌ సంసిద్ధత వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఆయన సూచనలకు అనుగుణంగానే, పవన్ తో పొత్తు వ్యవహారం మాట్లాడే బాధ్యతను బొత్స సత్యనారాయణకు జగన్ అప్పచెప్పినట్లు తెలుస్తోంది.