ఆ రోజున దాసరి మోహన్‌బాబును కాలితో ఎంత గట్టిగా తన్నారంటే..

 

దర్శక రత్న దాసరి నారాయణరావుకి.. మోహన్‌బాబుకి ఉన్న గురు-శిష్యు అనుబంధం గురించి టాలీవుడ్‌ లో అందరికీ తెలిసిన విషయమే. నటుడిగా మోహన్‌బాబు ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాకుండా ఆ తర్వాత ఆయనకు తన సినిమాల్లో వరుసగా అవకాశాలిమిచ్చి.. ఆయనను ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేలా చేసింది దాసరే! ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దాసరి తనకు పరిచయం అయిన రోజులను మోహన్ బాబు ఈ విధంగా గుర్తుకు చేసుకున్నారు.. ” అంతా కొత్తవారితో రూపొందుతున్న ‘స్వర్గం- నరకం’ సినిమాలో దాసరి అవకాశమిస్తారేమోనన్న ఆశతో ఆయనను కలవడానికి క్రమం తప్పకుండా తెల్లవారుజామున నాలుగు గంటలకు నేను వెళ్లేవాడిని.. నన్ను చూసిన ప్రతీసారి ఏంటయ్యా ఈ టైమ్‌లో వచ్చావు అంటూ దాసరి పద్మ.. కూర్చోమనేవారు. ఇలా చాలా సార్లు తిరిగాక దాసరి గారు నన్ను ఓ రోజు మేకప్ టెస్ట్‌కు రమ్మన్నారు. నాతో పాటు మరో పది మంది మేకప్ టెస్ట్‌ కు వచ్చారు. మా అందరికీ మేకప్ వేసి ఆడిషన్‌ చేశారు. ఐతే, వేరే వారికి ఈ పాత్ర ఇప్పించాలనే ఉద్దేశంతో నేను చేసిన ఆడిషన్ ను డైరక్షన్ డిపార్ట్‌మెంట్ కు చెందిన ఓ వ్యక్తి దాచేశాడు. అయితే మా గురువుగారు నా గురించి చెప్పి మరీ నేను యాక్ట్ చేసిన రష్ ను బయటకు తీయించారు. అలా, అంతా కొత్తవారితో చేయబోతున్న సినిమాలో నాకు సెకండ్ హీరో అవకాశమిచ్చారు. అప్పడే నా పేరును మోహన్‌బాబుగా కూడా ఆయన మార్చారు. విడిగా నా పట్ల ఎంత ప్రేమగా ఉండేవారో నటన నేర్పే విషయంలో కూడా అంత కఠినంగా దాసరి వ్యవహరించేవారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో నాకు ఓ పెద్ద డైలాగ్ ను ఇచ్చారు. దీంతో నేను టేక్స్ మీద టేక్స్ తీసుకున్నాను. దీంతో ఫిల్మ్ అయిపోతుండటంతో కోపం తెచ్చుకున్న దాసరి నన్ను కాలితో గట్టిగా నడుం మీద తన్నారు. దెబ్బ గట్టిగా తగలడంతో ‘అబ్బా’ అనుకుంటూ ఏడుపు మొహం పెట్టుకుని మేకప్ రూంలోకి వెళ్లిపోయాను. ‘ఇలా ఇష్టమొచ్చినట్టు తంతే, ఈయన దగ్గర ఎవడు చేస్తాడు.. నేను వెళ్లిపోతాను’ అంటూ నిర్మాతతో నేను అన్నాను. ‘నువ్వెళ్లిపోతే సినిమా ఏమైనా ఆగిపోతుందా’ అంటూ నాకు కౌంటర్ ఇచ్చాడు నిర్మాత. దీంతో, అవకాశం వదులుకోవడం ఇష్టం లేక, మనసు మార్చుకుని.. మళ్లీ మేకప్ వేసుకుని సెట్స్ పైకి వచ్చాను. వెంటనే, దాసరి నన్ను చూసి ” ఏంటయ్యా.. నన్నొదిలి ఎక్కడకు వెళతావ్‌..” అంటూ భోళాశంకరుడిలా నవ్వుతూ నన్ను ఆటపట్టించారు..” అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

‘బాహుబలి-2’ విడుదలై నెల రోజులు దాటినా, బాక్సాఫీస్ దగ్గర ఇంకా మంచి కలెక్షన్లు రాబడుతూనే ఉంది. ఇప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల్లో ‘బాహుబలి-2’ థియేటర్లు 60 నుంచి 70 శాతం ఫిల్ అవుతుండటం విశేషం. మరో వైపు, ఓ డబ్బింగ్ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు చూసి బాలీవుడ్‌ హేమాహేమీలు కూడా షాక్ అయిపోతున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా బాహుబలి-2 సాధించిన కలెక్షన్లు చూసి షాక్ తిన్నాడట. తన తదుపరి చిత్రం ‘ట్యూబ్‌లైట్‌’ తో బాహుబలి-2 ఇండియాలో సాధించిన రికార్డులన్నింటినీ అధిగమించాలని సల్మాన్ భావిస్తున్నాడట. దీనికి తగ్గట్టుగానే, ఇటీవల ముంబైలో జరిగిన ట్యూబ్‌లైట్ ప్రచారం కార్యక్రమంలో తన సినిమా బాహుబలి-2 కలెక్షన్లు దాటేయడం ఖాయమని సల్మాన్ ఖాన్‌ అన్నాడు. బాహుబలి-2 కలెక్షన్లను ట్యూబ్‌లెట్ దాటేయగలదనే నమ్మకంతో తాను ఉన్నానని సల్మాన్ వ్యాఖ్యానించాడు. మొత్తానికి, బాహుబలి-2 రికార్డులపై సల్మాన్ ఖాన్ దృష్టి పెట్టాడని ట్యూబ్‌ లైట్‌ ప్రెస్ మీట్‌లో అతడు చేసిన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. అయితే, ‘బాహుబలి-2’ రికార్డులను అధిగమించడం అంత ఈజీ కాదని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే, బాహుబలి-2 రికార్డులు బీట్ చేయాలని భావిస్తున్న సల్మాన్‌ ఖాన్ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి. ‘ట్యూబ్ లైట్’ చిత్రాన్ని ఇండో-చైనా యుద్ధం నేపథ్యంలో దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో సల్మన్‌ ఖాన్ కు జోడిగా చైనీస్ నటి చూచూ నటించింది. ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.