కుంబ్లే ఓ రాక్షసుడు.. అతడితో ఓ వేగలేంః టీం ఇండియా ఆటగాళ్లు

టీం ఇండియా చీఫ్ కోచ్ గా అనిల్  కుంబ్లే పదవి ఈ నెలాఖరులో ముగియనుంది. వాస్తవానికి కుంబ్లే కోచ్‌గా ఉన్న ఏడాది సమయంలో టీం ఇండియా ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించింది. దీంతో అతడిని మరో ఏడాది పాటు కొనసాగించడం లాంఛనమేనని అంతా అనుకున్నారు. అయితే, హఠాత్తుగా కుంబ్లేకు టీం కెప్టెన్ విరాట్ కోహ్లీకి విభేదాలు పొడచూపిన నేపథ్యంలో కొత్త కోచ్ ఎంపికకు బీసీసీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, కోచ్ విషయంలో జట్టు ఆటగాళ్ల అభిప్రాయాలు తీసుకునేందుకు బోర్దు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి, జట్టు మేనేజర్ ఎంవీ శ్రీధర్‌.. క్రికెట్ సలహా మండలి సభ్యుడు గంగూలీ వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చాలా మంది ఆటగాళ్లు కుంబ్లే తమతో వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించారు. కుంబ్లే ప్రాక్టీస్ సెషన్ ఎగ్గొట్టడాన్ని ఏమాత్రం ఒప్పుకోడని, ప్రాక్టీస్‌లో దెబ్బలు తగిలినప్పుడు రెస్ట్ కోసం అడిగినా కుంబ్లే వినిపించుకోడని.. ప్రాక్టీస్ చేయాల్సిందేనని ఖరాఖండిగా చెబుతాడని..ఆ సమయంలో కుంబ్లే ఏమాత్రం మానవత్వం లేకుండా రాక్షుసుడిలా ప్రవర్తిస్తాడని వారు కంప్లైంట్ చేశారు. గాయాలతో ఎలా ప్రాక్టీస్‌ చేయడం ఎలా సాధ్యమని వారు తమ ఆవేదనను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సుమారు 12 మంది ఆటగాళ్లు ఇదే రకమైన ఫిర్యాదును చేశారని సమాచారం.

కుంబ్లే కు ముందు కోచ్‌గా వ్యవహరించిన రవిశాస్త్రి తమతో మరీ ఇంత స్ట్రిక్ట్‌ గా ఉండేవాడు కాదని.. తమతో స్నేహంగా, సరదాగా ఉండేవాడని వారు తెలిపారు.  అయితే, ఆటగాళ్లు కుంబ్లే పై చేసిన ఫిర్యాదుపై కొంత మంది మాజీ స్టార్‌ ఆటగాళ్లు తేలిగ్గా తీసుకుంటున్నారు. కోచ్‌గా కుంబ్లే అలాగే ఉండాలని.. అతడు అంత కఠినంగా ఉండటం వల్లే జట్లు వరుసగా విజయాలు సాధించగలుగుతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. జట్టు పట్ల కోచ్‌ సీరియస్‌గానే ఉండాలని.. అలా ఉంటేనే  మంచి ఫలితాలు వస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది ఆటగాళ్లు చిన్న చిన్న గాయాలకే ప్రాక్టీస్ ఎగ్గొట్టాలని చూస్తుంటారని.. అలా జరక్కుండా చూస్తున్నందుకు కుంబ్లే మీద అక్కసు వెళ్లగక్కడం కరెక్ట్ కాదని మాజీలు పేర్కొంటున్నారు. ఆటగాళ్ల ప్రాక్టీసే విషయంలో కోచ్ చూసీచూడనట్లు వ్యవహరిస్తే, ఫలితాలు కూడా నెగటివ్‌గానే ఉంటాయని వారు చెబుతున్నారు.   ఈ నేపథ్యంలో బీసీసీఐ  కుంబ్లే విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటునేది వేచి చూడాలి!