స్టార్ డైరక్టర్‌ ప్రవర్తన నచ్చక.. సినిమా నుంచి తప్పుకున్న స్టార్ హీరో

చియాన్ విక్రమ్‌.. క్రియేటివ్ డైరక్టర్‌ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధృవ నక్షత్రం’ అనే సినిమా చేస్తున్నాడు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యింది. అయితే, తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు తెలుస్తోంది. షూటింగ్ సమయంలో గౌతమ్ మీనన్ ఇష్టమొచ్చినట్లు కథలో మార్పులు చేయడంతో.. అది నచ్చక సినిమా నుంచి విక్రమ్ వైదొలిగినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయిన తర్వాత ఇప్పుడు కథలో మార్పులు చేయడం చియాన్ విక్రమ్ కు ఏమాత్రం రుచించలేదని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అందుకే, ఈ సినిమా కోసం కేటాయించిన డేట్స్ ను తన మరో స్కెచ్ కు అతడు కేటాయించాడు. దీంతో, నిర్మాతలు హీరోకి.. దర్శకుడికి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

వాస్తవానికి, ఇలా లొకేషన్‌లో మార్పులు- చేర్పులు చేయడం గౌతమ్ మీనన్‌ ముందు నుంచి అలవాటే! ఇటీవల నాగచైతన్య హీరోగా రూపొందిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా సమయంలో కూడా గౌతమ్ మీనన్ ఇలాగే చేశాడు. సినిమా షూటింగ్ సగం పూర్తయిన తరువాత క్లైమాక్స్ ను  కొత్తగా రాసి షూటింగ్ కంప్లీట్ చేశాడు. దీంతో సినిమా షూటింగ్ అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా పూర్తయ్యింది. వాస్తవానికి, ‘ధృవనక్షత్రం’ కథను ముందు మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు. అయితే, ప్యూర్ కమర్షియల్ స్టోరీ కాకపోవడంతో మహేష్ ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడు. ఆ తర్వాత హీరో సూర్య ఈ సినిమా చేసేందుకు ఒప్పుకుని డేట్స్ కూడా ఇచ్చాడు. అయితే, స్క్రిప్ట్ లో మార్పులు-చేర్పులు చేస్తున్నానని, సినిమాను ఎప్పటికప్పుడు ఆలస్యం చేస్తుండటంతో సూర్య ఈ ప్రాజెక్ట నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ విక్రమ్ చేతుల్లోకి వెళ్లింది.