ఎన్ని నాన్‌-వెజ్ వంటకాలున్నా, ఆ వెజ్ ఐటమ్ లేకపోతే ప్రభాస్ భోజనం చేయడుః రాజమౌళి

దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన కళాఖండం ‘బాహుబలి-2’ విడుదలై నెల రోజులు దాటినా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ కలెక్షన్లు సాధిస్తూనే ఉంది. బాహుబలి రిలీజ్ అయ్యాక ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం రాజమౌళి, శోభు యార్లగడ్డ, అనుష్కలు లండన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఓ ప్రేక్షకులు ప్రభాస్, రానాల డైట్ గురించి.. వారు చేసిన వర్క్‌వుట్స్ గురించి అడిగినప్పుడు రాజమౌళి ఆసక్తికర సమాధానమిచ్చారు .. ”సినిమా అసాంతం ప్రభాస్‌, రానా లు స్ట్రిక్ట్‌గా డైట్ మెయిన్‌టెయిన్ చేశారు.. ఇవి తినాలి అవి తినాలి అంటూ నేను వారికి సలహాలేమీ ఇవ్వలేదు.. మంచి శరీర దారుఢ్యం కోసం వాళ్లే ఓ స్పెషల్ ట్రైనర్ ను నియమించుకుని కష్టపడ్డారు. అయితే, ప్రభాస్.. రానాలకు ప్రతీ నెల ఆఖరి వారంలో ఓ ‘చీట్ మీల్ డే’ ఉండేది. ‘చీట్ మీల్ డే’ నాడు ఎలాంటి ఆహార నిబంధనలు పాటించకుండా అన్నీ శుభ్రంగా తినేయవచ్చు. ఓ చీట్ మీల్ డే నాడు ప్రభాస్ 15 రకాల బిర్యానీలు వండించుకున్నాడు. చేపల పులుసు, రొయ్యల కూర.. చికెన్‌.. మటన్ ఇలా అనేక నాన్ వెజ్ వంటకాలు వండించుకున్నాడు.

అయితే ఎన్ని నాన్‌ వెజ్ వంటకాలు ఉన్నా చట్నీ లేకపోతే ప్రభాస్ కు మద్ద దిగదు. ఓ రోజు తెల్లవారుజామున రెండు గంటల వరకు మేము పుట్‌బాల్ ఆడాం. గేమ్ అయిపోగానే తినేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు. చుట్టూ అనేక రకాల బిర్యానీలు నాన్‌ వెజ్ వంటకాలు ఉన్నా.. చట్నీ ఎక్కడుంది అని అక్కడే ఉన్న తన బావను ప్రభాస్ అడిగాడు.. చట్నీ లేకపోతే తాను తినలేనని తేల్చిచెప్పడంతో.. ఆ తెల్లవారుజామున ప్రభాస్ బావ వెంటనే ఇంటికి వెళ్లి తన భార్యను నిద్ర లేపి చట్నీ చేయించుకుని తీసుకువచ్చాడు. ఫుట్ బాల్ ఆడి బాగా ఆకలిగా ఉన్నప్పటికీ.. ప్రభాస్ ఇంటి నుంచి చట్నీ వచ్చేవరకు ముద్ద కూడా తినలేదు అని రాజమౌళి చెప్పుకొచ్చారు.