‘బాహుబలి’ నిర్మాతలు ఆ ఫ్లాప్ దర్శకుడి కోసం భారీ రిస్క్ చేస్తున్నారు?

 

 

‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి ఇప్పటి దాకా తన తదుపరి ప్రాజెక్ట్ విషయమై ఇంకా నిర్ణయించుకోలేదు. అయితే, ఈ చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు మాత్రం తమ తదుపరి ప్రాజెక్ట్‌ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. దర్శకేంద్రుడు  రాఘవేంద్రరావు తనయుడు.. తమకు స్వయానా బావమరిది అయిన కోవెలమూడి ప్రకాష్ రావుతో మరో భారీ ప్రాజెక్ట్ నిర్మించేందుకు వారు సమాయత్తమవుతున్నారు. ఫాంటసీ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా నటించేందుకు ఒప్పుకున్నాడు. దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది.

 

అయితే, రాఘవేంద్రరావు తనయుడు అయినప్పటికీ ఇప్పటిదాకా ప్రకాష్ రావ్ ఒక్క హిట్ ను కొట్టలేదు. అతడి దర్శకత్వంలో రూపొందిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. వరుసగా ‘అనగనగా ఓ ధీరుడు’, ‘సైజ్ జీరో’ చిత్రాలు ఏమాత్రం ఆకట్టుకునేలా అతడు తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో, ఎంత దగ్గరి బంధువైనా కోవెలమూడి ప్రకాష్‌తో ఏకంగా 40 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా తీయడం రిస్కేనని ఫిలింనగర్ వర్గాలు అభిప్రాయపడుతున్నాడు. ఓ వైపు ప్రకాష్ కి దర్శకుడిగా ఏమాత్రం మార్కెట్ లేదు. ఇక, హీరోగా శర్వానంద్ మార్కెట్ 20 కోట్ల రేంజ్‌లోనే ఉంది. ఈ  ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన శతమానం భవతి బాక్సాఫీస్ దగ్గర 22 కోట్లను కలెక్ట్ చేసుకున్నాడు. ఈ  చిత్రంతోనే అతడు 20 కోట్ల  మార్కెట్ రేంజ్ ను అందుకున్నాడు. ఈ క్రమంలోనే, హీరో మార్కెట్ రేంజ్ కంటే దాదాపు డబల్ బడ్జెట్ ను ఈ సినిమా కోసం ఖర్చుపెడుతుండటం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే, ఈ విషయంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిల ఆలోచన మరో విధంగా ఉంది.  బాహుబలి నిర్మాతలుగా తమ బ్రాండ్ ఈ చిత్రానికి ఉపయోగపడుతుందని.. దానిని ఉపయోగించుకుని ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ,హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేసుకోవచ్చని.. తద్వారా పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ బిజినెస్ చేసుకోవచ్చని బాలీవుడ్ నిర్మాతలు నమ్మకంగా ఉన్నారట.