సుష్మా స్వరాజ్‌ ను, హరీష్ సాల్వేను ప్రశంసలతో ముంచెత్తిన మోదీ

కుల్‌భూషణ్ జాదవ్ కేసులో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) భారతదేశానికి అనుకూల తీర్పునిచ్చిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలో అత్యంత చురుగ్గా వ్యవహరించిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ను.. ఈ కేసును బలంగా వాదించిన హరీష్ సాల్వేను ఆయన అభినందనలతో ముంచెత్తారు. ఈ మేరకు ఐసీజీ ఇచ్చిన తీర్పు తెలిసిన వెంటనే ఆయన సుష్మా సర్వాజ్‌తో మాట్లాడి తన అభినందనలు తెలిపారు. కుల్‌భూషణ్ జాదవ్‌ భారతదేశ గూఢచారి అని ఆరోపిస్తూ పాకిస్థాన్ సైనిక న్యాయస్థానం ఆయనకు ఉరి శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆయనను కాపాడేందుకు భారతదేశ విదేశాంగ బృందం గత కొన్ని రోజులుగా  అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సుష్మా స్వరాజ్, న్యాయవాది హరీశ్ సాల్వే తదితరులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. వారి కృషికి తగ్గట్టుగానే అంతర్జాతీయ న్యాయస్థానం సానుకూల తీర్పునివ్వడంతో భారతదేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.