రాజకీయాల్లో ‘దూకుడు’ పెంచిన పవన్ కల్యాణ్‌.. సంప్రదాయ పార్టీలకు పూర్తి భిన్నంగా జనసేన!

‘జనసేన’ పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ రాజకీయాల్లో ఇతర సాంప్రదాయ పార్టీలకు భిన్నంగా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన నాయకులను ఎంపిక చేయడం ద్వారా జోరును పెంచిన పవర్ స్టార్ తాజాగా పార్టీకి సంబంధించిన మరో కీలక విభాగాన్ని ఏర్పాటు చేశారు. జనసేన సేవాదళ్ ను ఆయన తాజాగా ప్రారంభించారు. ఇతర పార్టీలకు విరుద్ధంగా జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలంటే గ్రామ స్థాయిలో కార్యకర్తల బలం ఉండాలని పవన కల్యాణ్ నమ్మారు. పార్టీకి సుశిక్షితులైన.. నీతి, నిజాయతీ, నిబద్ధత కలిగిన కార్యకర్తలుంటే ప్రజలు కూడా జనసేనను విశ్వసిస్తారని ఆయన భావించారు. అందుకోసం పవన్ తీవ్రంగా ఆలోచించి జనసేనకు అనుబంధంగా సేవాదళ్ ను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజల వద్దకు వెళ్లకుండా, ఎన్నికలు లేని సమయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా.. వారికి తమ పరిథి మేరకు సహాయం చేసేలా.. వారి కోసం పోరాటాలు చేసేలా.. సేవాదళ్ కార్యకర్తలుంటారని పవన్ కల్యాణ్ తెలిపారు. సేవాదళ్ కేంద్ర కమిటీ ఆవిర్భావ సమావేశం హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో జరిగింది. ‘జనసేన’ సేవాదళ్ ప్రారంభించిన సందర్భంగా పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాడానికే సేవాదళ్ ను ఏర్పాటు చేశానని తెలిపారు. సేవాదళ్ నియమావళిని ఈ సందర్భంగా విడుదల చేస్తూ పది అంశాలతో కూడిన ఈ నియమావళిని సేవాదళ్ లోని ప్రతి కార్యకర్త కచ్చితంగా పాటించాలని పవన్ సూచించారు. భవిష్యత్తులో సేవాదళ్ ను మరింత విస్తృత పరిచి మరింతమందిని తీసుకుంటామన్నారు. తొలుత జిల్లాస్థాయిలో వందమంది కార్యకర్తలతో సేవాదళ్ సేవలు ప్రారంభం అవుతాయని.. ఆ తరువాత మండల గ్రామస్థాయి సేవాదళ్‌ కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నామని పవన్ కల్యాణ్‌ ప్రకటించారు.