‘బాహుబలి పార్ట్‌-2’ దెబ్బకు స్పైడర్ రిలీజ్ డేట్ మారింది!

ప్రిన్స్ మహేష్‌ బాబు తాజా చిత్రం ‘స్పైడర్‌’ సుమారు 110 కోట్ల భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతోంది. తొలత ఈ సినిమాను జూన్‌ 23న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే, షూటింగ్ బాగా ఆలస్యమవుతుండటంతో, ఆ తర్వాత సినిమా రిలీజ్ ను  ఆగస్ట్‌కు మార్చారు.  అయితే, ప్రస్తుతం ఆగస్ట్‌లో కూడా ఈ సినిమా రిలీజయ్యే పరిస్థితి కనపడటం లేదు. దీనికి కారణం సినిమా అవుట్‌ఫుట్‌ సరిగ్గా రాకపోవడమేనని తెలుస్తోంది.  ‘స్పైడర్‌’  సినిమా గ్రాఫిక్స్‌ వర్క్‌  ను తొలత ఓ కంపెనీకి అప్పచెప్పారు. ఆ కంపెనీ కూడా అనుకున్న టైంకే వర్క్‌ను అప్పచెప్పింది. అయితే, ‘బాహుబలి పార్ట్‌-2’ రిలీజ్ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ పై ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగాయని.. ఈ నేపథ్యంలోనే, ప్రస్తుతం చేసిన  ‘స్పైడర్’ గ్రాఫిక్స్ వర్క్‌తో సినిమాను రిలీజ్ చేస్తే ప్రేక్షకులు నిరాశ చెందడం ఖాయమని ఈ సినిమా దర్శకనిర్మాతలు భావించారట. దీంతో, తాజాగా ‘స్పైడర్’ సినిమాకు సంబంధించిన విజ్వువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను ‘మకుట’ గ్రాఫిక్స్  అధినేత కమల్ కన్నన్ కు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. స్పైడర్ సినిమా కు సంబంధించిన విజ్వువల్ ఎఫెక్ట్స్‌పై తొలత దర్శకనిర్మాతలు అంతగా దృష్టిపెట్టలేదని.. అయితే,  ‘బాహుబలి పార్ట్‌-2’ చూసిన తర్వాత గ్రాఫిక్స్‌ సాధారణ స్థాయిలో ఉంటే ప్రేక్షకులకు ఎక్కడం కష్టమనే ఆలోచనతో నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చారని యూనిట్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ఖరారు చేస్తున్నాయి. అయితే, ‘స్పైడర్‌’ గ్రాఫిక్స్ వర్క్‌ ను చేపట్టడానికి ‘మకుట’ ఓ కండీషన్ పెట్టిందట. ఈ సినిమా గ్రాఫిక్స్‌ వర్క్‌ను చేపట్టడానికి తగిన సమయం ఇవ్వాలని ‘మకుట’ బృందం స్పష్టం చేసినట్టు సమాచారం. తక్కువ సమయంలో హడావిడిగా చేయడం కుదరదని, ఒకవేళ అలా చేస్తే తమ సంస్థకు ఉన్న క్రెడిట్ దెబ్బ తినే ప్రమాదం ఉంటుందని చెప్పినట్టు సమాచారం. ఈ కారణం వల్లే ఆగస్టులో విడుదల అవుతుందని అనుకొన్న సినిమా సెప్టెంబర్ కు వెళ్లిందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుంది.