తమిళనాట సరికొత్త ఇండస్ట్రీ హిట్‌ బాహుబలి పార్ట్‌-2! ‘బాహుబలి’ దెబ్బకు రజనీ రికార్డులు బలి!

ఓటమి ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన ‘బాహుబలి పార్ట్‌-2’ దేశ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ అన్ని రికార్డులు బద్దలుకొడుతోంది. ఇప్పటిదాకా తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్ల రికార్డ్‌ రజనీకాంత్ ‘ఎంతిరన్’ పేరిట ఉంది. ఏడేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా తమిళనాట 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇప్పటిదాకా ఈ రికార్డ్ దరిదాపుల్లోకి మరెవరు రాలేదు. తాజాగా ఈ సోమవారంతో ‘బాహుబలి పార్ట్‌-2’ ఆ కలెక్షన్లు క్రాస్ చేసి, తమిళనాట సరికొత్త ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అలాగే, తమిళనాట వంద కోట్లు కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా ‘బాహుబలి-2’ నిలిచింది. మొత్తానికి, రజనీకాంత్ రికార్డ్‌ను తమిళ అగ్రహీరోలైన విజయ్‌, అజిత్‌ లాంటి వాళ్లు కాకుండా నాన్‌ లోకల్ హీరో అయిన ప్రభాస్ బ్రేక్ చేయడం విశేషంగా కోలీవుడ్‌ ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి ఇప్పటిదాకా ‘బాహుబలి పార్ట్‌-2’ చిత్రం 285 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక హిందీలో ఈ చిత్రం ఇప్పటిదాకా సుమారు 440 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు సాధించింది. అలాగే, యుఎస్‌ బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ఇప్పటిదాకా వంద కోట్ల కలెక్షన్లు సాధించింది. మలయాళంలో అతి తక్కువ రోజుల్లో ఈ చిత్రం 50 కోట్ల కలెక్షన్లు సాధించింది.  ఇలా, అన్ని ఏరియాల్లో కలుపుకుని 1,000 కోట్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ‘బాహుబలి పార్ట్‌-2’ నిలిచింది.