జాదవ్‌ కేసులో భారత్ విజయం! తుది తీర్పు ఇచ్చేవరకు జాదవ్ ను ఉరి తీయడానికి వీల్లేదన్న అంతర్జాతీయ న్యాయస్థానం

కులభూషణ్ జాదవ్  కేసులో పాకిస్థాన్‌ కు  చుక్కెదురైంది. జాదవ్‌  కు  పాకిస్థాన్‌ ఆర్మీ కోర్టు విధించిన ఉరి శిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. తాము తుది తీర్పు ఇచ్చేవరకు అతడిని ఉరి తీయడానికి వీల్లేదని అంతర్జాతీయ న్యాయ స్థానం పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వియన్నా ఒప్పందానికి భారత్‌-పాక్‌లు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. అలాగే, జాదవ్ ను కలుసుకునే హక్కు భారత్ దౌత్యాధికారులకు ఉందని.. అతడికి భారత్ అన్ని విధాలైన దౌత్య సహాయం  చేయవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ  కేసు విషయంలో భారత్ లేవనెత్తిన అంశాలు చాలా న్యాయ బద్ధంగా ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. కులభూషణ్ జాదవ్‌ అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలో రాదన్న పాక్‌ వాదనను కూడా కోర్టు కొట్టిపారేసింది.